ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని, తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆయన మాట్లాడుతూ.. సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పోలీసులు అడుగడుగునా తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని, సభకు రాకుండా ఇప్పటికే ఆర్టీసీ బస్సులను ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్ ప్రైవేటు వెహికల్స్ ని కూడా రానివ్వకుండా చెక్ పోస్టులు పెట్టి పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Police Harassment: స్టేషన్‌లో ఎస్సై వికృత చేష్టలు.. మైనర్ దుస్తులు విప్పించి, ఫోటోలు తీసి..
గ్రామాలలో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు నిజాయితీగా పని చేయాలి… బీఆర్ఎస్ కు ఏజెంట్లుగా పనిచేయొద్దని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభ ఆగదని ఆయన వ్యాఖ్యానించారు. మా కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ తట్టుకోవడం కష్టమన్న శ్రీధర్ బాబు.. అన్నీ గమనిస్తున్నాం… ఇప్పటికైనా తమ సభకు అడ్డంకులు సృష్టించొద్దని పోలీసులను కోరుతున్నామన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ జనగర్జన సభకు వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తల వాహనాలను నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు.
Also Read : Maharashtra: బీజేపీ మార్క్ రాజకీయం.. రెండేళ్లలో ప్రతిపక్ష కూటమి కకావికలం..