ప్రపంచ దేశాలను వణికించిన కొవిడ్ మహమ్మారి ప్రభావం రాజకీయ పార్టీలను కూడా తాకింది. కొవిడ్ కారణంగా పార్టీలకు వచ్చే విరాళాలకు భారీగా కోతపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలకు అందిన వివరాలతో విడుదలైన ఏడీఆర్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు అందిన విరాళాలు ₹420 కోట్లకు పైగా తగ్గాయని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 41.49 శాతం తగ్గాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్ మొదటి వేవ్ 2020 మార్చి చివరి వారంలో అంటే ఆర్థిక ఏడాది ప్రారంభం ముందే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించేందుకు కారణమైంది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. భారతీయ జనతా పార్టీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్ల విరాళాలు రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.477.54కోట్లకు తగ్గింది. అంటే 39.23శాతం మేర విరాళాలు తగ్గాయి. ఇక, కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01కోట్ల విరాళాలు రాగా.. కరోనా సమయంలో కేవలం రూ.74.52కోట్లు మాత్రమే సమకూరాయి.
Loksabha Speaker: ఏ పదాన్ని నిషేధించలేదు.. తప్పుడు ప్రచారాలు చేయొద్దు..
అత్యధికంగా దిల్లీ నుంచి రూ. 246కోట్లు జాతీయ పార్టీలకు విరాళంగా అందాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఎనిమిది జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 80శాతానికి పైగా అంటే.. రూ.480.655కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చినవే. మరో రూ.111.65 కోట్లను 2,258 మంది వ్యక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. అధికార బీజేపీకి కార్పొరేట్, వ్యాపార రంగం నుంచి సుమారు 11 వందల విరాళాలు అందగా.. వీటి విలువ రూ. 416.79 కోట్లుగా ఉంది. విపక్ష కాంగ్రెస్‌కు ఆయా వర్గాల నుంచి 146 విరాళాలు అందగా.. వాటి విలువ 38.63 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
.