Diwali Celebrations: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ దీపావళి కోలాహలం నెలకొంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద వెలుగుల ఉత్సవాన్ని ఆస్వాదిస్తున్నారు . టపాసుల కొనుగోళ్లతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. అందరి ఇళ్లల్లో కొత్త కాంతులు విరజిమ్మాలని అందరూ నూతన ఉత్సాహంతో దీపావళిని జరుపుకుంటున్నారు. భాగ్యనగరంలో దీపావళి సందడి మొదలైంది. టపాసులు కాలుస్తూ నగరవాసులు సందడి చేస్తున్నారు. వివిధ రకాల టపాసుల మోతతో నగరం మారుమోగుతోంది. చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా నగరవాసులు దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు.
రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ సారి దీపావళిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో దీపావళి సందడి అంతా ఇంతా కాదు. ఏ గల్లీలో చూసినా మతాబుల మోతే. ఏ వీధికెళ్లినా నింగిని తాకే తారాజువ్వలే కనిపిస్తున్నాయి. రెండేళ్ల పాటు దూరంగా వేడుకలకు దూరంగా ఉండగా.. ఈ ఏడాది పండుగను బాగా జరుపుకోవాలనే ఉత్సాహం జనాల్లో కనిపిస్తోంది. దీపాల వెలుగులతో భాగ్యనగరం వెలుగులీనుతోంది. కుటుంబసభ్యులతో కలిసి బాణాసంచా కాల్చుతూ సంతోషంగా వేడుకలు చేసుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలతో గతేడాది పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఉత్సాహంగా వేడుకలు జరుగుతున్నాయి. టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
Boora Narsaiah Goud: ఈ నెల 26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. పండుగ సంబురాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీపకాంతులతో లోగిళ్లన్నీ దేదీప్యమానమయ్యాయి. పిల్లలూ పెద్దలు పోటీ పడి మరీ బాణసంచా కాల్చి.. పండుగ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. వెలుతురు పూలు విరజిమ్మే చిచ్చుబుడ్లను, చిటపడలాడుతూ మెరిసే కాకరపువ్వొత్తులు, ఆకాశానికి దూసుకెళ్లి వెలుగులు పంచే తారాజువ్వలు, భూచక్రాలు.. ఇలా రకరకాల మతాబులు కాల్చి సందడి చేస్తున్నారు. కానీ బాణాసంచా ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ సంవత్సరం మునుపెన్నడూ లేనివిధంగా ధరలు భగ్గుమంటున్నాయి. కాల్చకముందే ధరలు పేలిపోతున్నాయని, రాకెట్ల కంటే వేగంగా ఆకాశంలోకి దూసుకువెళ్లాయని జనాలు వాపోతున్నారు.