Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు పెరిగింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ రాజకీయ–యాక్షన్ సినిమా దాదాపు అన్ని సంప్రదాయ నియమాలను దాటేస్తోంది. ఇటీవలి కాలంలో థియేటర్ లో ఆడి విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మూడు గంటల 33 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రజలకు ఆకట్టుకుంటోంది. సెలవులు లేవు, పండుగ సీజన్ కాకపోయినప్పటికీ.. విడుదలైన 15 రోజుల్లో భారత్‌లోనే దాదాపు రూ.500 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇదే తరహా ఊపు కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించే దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. భారతీయ సినిమాల చరిత్రలోని అతి పెద్ద బ్లాక్బస్టర్ల సరసన చేరే అవకాశం ఉంది.
సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. రెండు వారాల థియేటర్ రన్‌కే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండో వారం కూడా బలమైన కలెక్షన్లు, వీకెండ్‌ల్లో హౌస్‌ఫుల్ షోలు కొనసాగాయి. ప్రేక్షకుల ఆదరణ చూస్తే.. మూడో వీకెండ్ చివరికి రూ.1,000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్లో ఉన్న భారతీయ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.
రూ. వెయ్యి కోట్ల మార్క్ దాటిన సినిమాలు
దంగల్ – రూ.2070.3 కోట్లు
బాహుబలి 2 – రూ.1788.06 కోట్లు
పుష్ప 2 – రూ.1742.1 కోట్లు
ఆర్ఆర్ఆర్ – రూ.1230 కోట్లు
జవాన్ – రూ.1160 కోట్లు
పఠాన్ – రూ.1055 కోట్లు
కల్కి 2898 ఏడి – రూ.1042.25 కోట్లు
ఈ సినిమాల సరసన ధురంధర్ చేరితే, పురాణాలు, ఫాంటసీ లేదా సిరీస్ మాత్రమే కాకుండా.. రాజకీయ నేపథ్య కథలను సైతం ప్రేక్షకుల ఇష్టపడతారనే గుర్తింపు దక్కనుంది. మరోవైపు.. ట్రేడ్ నిపుణుడు, నిర్మాత గిరీష్ జోహర్ ఈ విజయానికి ప్రధాన కారణం దర్శకుడేనని చెబుతున్నాడు. “నిజంగా ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడికే చెందుతుంది. ఆదిత్య ధర్ సినిమాను ఎలా ఊహించాడు? ఎలా చూయించాలనుకున్నాడు? అన్నదే కీలకం. ప్రేక్షకులను తెలివైనవారిగా భావించి, కథ అద్భుతంగా చూయించారు” అని వెల్లడించారు. కాగా.. ఈ భారీ విజయం రణ్వీర్ సింగ్ కెరీర్‌కు ఒక కీలక మలుపు కానుంది.