NTV Telugu Site icon

Kishan Reddy : డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం బహిర్గతం

Kishan

Kishan

Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేసిందని తెలిపారు.

డీలిమిటేషన్ అంశంపై ఇప్పటివరకు పార్లమెంట్‌లో కానీ, కేబినెట్‌లో కానీ ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టంగా తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే పాలన అవినీతితో నిండిపోయిందని, స్టాలిన్ కుటుంబ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దాచిపెట్టేందుకు డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

భారతీయ జనతా పార్టీ దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ దక్షిణాదిలో బలపడకూడదన్న కుట్రతో కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కలసి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల పట్ల తమ విధేయతను నిరూపించుకున్న బీజేపీ, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి పనులను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన గురించి చట్ట ప్రక్రియ చాలా స్పష్టమైనదని, ముందుగా జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంటుందని, ఆ తర్వాతే చర్చలు, నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కలిసి డీలిమిటేషన్ అంశాన్ని కేంద్రంపై దుష్ప్రచారానికి వాడుకోవడం తగదని పేర్కొన్నారు.

గత పదిన్నరేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని, సమర్థవంతమైన పరిపాలనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

SRH vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఎస్ఆర్హెచ్