Risky Heart Surgery: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. గర్భం లోపల శిశువుకు రిస్కీ హార్ట్ సర్జరీ చేశారు. 28 ఏళ్ల మహిళ గతంలో మూడుసార్లు గర్భం కోల్పోవడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పిండంలోని శిశువు గుండె పరిస్థితి గురించి తెలియజేశారు. గుండెలో రక్త ప్రవాహం జరుగకుండా వాల్వ్ మూసుకుపోయిందని తెలిపారు. పిండంలోనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రక్రియకు సమ్మతించిన తర్వాత తల్లిదండ్రులు ప్రస్తుత గర్భాన్ని కొనసాగించాలని కోరుకున్నారు. ఎయిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ సైన్సెస్ సెంటర్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, ఫీటల్ మెడిసిన్ నిపుణుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది.
Read Also: Sim Card: మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా?
AIIMSలోని ప్రసూతి & గైనకాలజీ విభాగం (ఫిటల్ మెడిసిన్)తో పాటు కార్డియాలజీ, కార్డియాక్ అనస్థీషియా విభాగానికి చెందిన వైద్యుల బృందం ఆపరేషన్ తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని ప్రకటించింది. వైద్యుల బృందాలు పెరుగుదలను పర్యవేక్షిస్తున్నాయి. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే కొన్ని రకాల గుండె జబ్బులను గుర్తించవచ్చు. వాటిని కడుపులోనే చికిత్స చేయడం వలన పుట్టిన తర్వాత శిశువు సాధారణ అభివృద్ధికి అది తోడ్పడుతుందని వైద్య బృందం తెలిపింది.
Read Also:Murder : డ్రములో డెడ్ బాడీ.. రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
ఆస్పత్రి వైద్యులు తెలిపిన ప్రకారం.. ఈ ప్రక్రియ అల్ట్రాసౌండ్ సాయంతో ఆపరేషన్ కొనసాగించారు. తొలుత శిశువు గుండెలోకి తల్లి ఉదరం ద్వారా సూదిని ప్రవేశపెట్టారు. తర్వాత, బెలూన్ కాథెటర్‌ని ఉపయోగించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి అడ్డుపడిన వాల్వ్‌ను తెరిచారు. ఈ ప్రకియ తర్వాత శిశువు గుండె బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామన్నారు.