Huge Floods at Atmakur Bus Stand: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్.. నెల్లూరు వద్ద కేంద్రీకృతమై తదుపరి తూర్పు దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల జోరుకు నెల్లూరు నగరంలోని కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లూరు తూర్పు, పడమర భాగాలను కలిపే ఆత్మకూరు బస్టాండ్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రామలింగాపురం, మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జిలలోకి భారీగా వరద నీరు చేరింది. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నీటిని అధికారులు మోటార్లు పెట్టి తోడుతున్నారు.
రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాగుంట సుబ్బరామిరెడ్డి సర్కిల్ నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్ వరకు వరద నీరు చేరింది. దీంతో మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి వద్ద రాకపోకలను నిలిపివేశారు. వరద నీరు అధికంగా చేరుతుండటంతో సమీపంలోని అపార్ట్ మెంట్‌లలోని సెల్లర్‌లలోకి నీరు చేరుతోంది. తుఫాన్ వస్తుందని ముందుగానే తెలిసినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గే క్లారిటీ!
తీర ప్రాంతంతో పాటు పల్నాడు లోనూ మిచౌంగ్ తుఫాను ప్రభావం. బాగానే ఉంది. బాపట్ల తీరంలో సముద్రపు అలలు విరుచుకు పడుతునాయి. దాంతో తీర ప్రాంతం ప్రజలకు అధికారులు హై అలెర్ట్ జారీ చేశారు. మరోవైపు పల్నాడు ప్రాంతం నరసరావుపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప్రత్తిపాడులో పొగాకు, మొక్కజొన్న, శనగ పంటలు నీట మునిగాయి. నరసరావుపేట ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా పలు జిల్లాలో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.