కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు రెండున్నర లక్షల కోట్లు ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్లకు అవి చేరుకున్నాయని నారాయణ ధ్వజమెత్తారు..
READ MORE: Amit Shah: లోక్‌సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు
డబ్బులు ఎగవేతలో ఒక విజయ్ మాల్య తప్ప, 28 మంది గుజరాత్ రాష్ట్రానికే చెందినవారని, ఎక్కువ మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొండి బకాయిల పేర్ల మీద కార్పొరేట్ వ్యక్తులకు డబ్బును మాఫీ చేశారన్నారు. భారతదేశంలో ఉన్న బిలియనీర్స్ బయటికి వెళ్తామని చెప్పారని, ఇది దేశ సంపద తరలిపోయేది కాదా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో భారతదేశం మూడో స్థానంలో ఉందని చెబుతున్నారని, కానీ 170 దేశాల ఆకలి సూచీలో భారతదేశం 112వ స్థానం ఉన్నదని, పేదల జీవన ప్రమాణాలు పెరగలేదని వాపోయారు. సత్వరమే కేసులు పరిష్కరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్నారిపై జరిగిన అఘాయిత్యం కేసు 20 రోజులలోనే చర్యలు తీసుకున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా ఆర్థిక కేసులు ఎదుర్కొంటూ జగన్ జైలు బయటనే ఉన్నాడని, కోడి కత్తి కేసు, వైయస్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్న ముద్దాయికి ఎందుకు శిక్ష పడటం లేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.