Congress Mahadharna in Delhi Today: తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి.. రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు మహాధర్నా నిర్వహించనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బీసీ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. బీసీ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన యూబీటీ, ఎన్సీపీ(ఎస్పీ), ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ.. పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ధర్నా జరగనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు మంగళవారమే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధర్నాను ప్రారంభిస్తారు. ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలుస్తోంది.
Also Read: Kohli-Rohit: కోహ్లీ, రోహిత్‌కు కష్టమేనా?.. హిట్‌మ్యాన్ కల అంతేనా ఇక?
ఢిల్లీలో మహాధర్నా ఏర్పాట్లను మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్ గౌడ్ సహా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. వేదికపై 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 1500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మహాధర్నాలో పాల్గొనే వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తదితరులకు ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్‌లో వసతి ఏర్పాటు చేశారు.