శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే స్థానాలు గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. దీంతో ఆమె రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. ఇక అమేథీ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై కూడా తర్జనభర్జన జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ నామినేషన్ వేశారు. దీంతో అమేథీలో రాహుల్ పోటీపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు అమేథీ నుంచి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీలోకి దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఈసీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
ఇదిలా ఉంటే వరుణ్‌గాంధీని రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగాలని బీజేపీ ప్రతిపాదించింది. ఇందుకు వరుణ్‌గాంధీ నిరాకరించారు. గతంలో ఆయన పిలిభిత్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించింది. తన సోదరిపై పోటీ చేసే ఉద్దేశం లేకనే ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఇక్కడ సోనియాగాంధీ నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. కానీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆమె తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. తదుపరి పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. అమేథీలో మాత్రం మే 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి