AP Caste Census: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె.మాధవిలత అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, పూర్వపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు హాజరయ్యారు.
కులగణన ఇదే మొదటి సారి: మంత్రి వేణుగోపాలకృష్ణ
కులగణన కాకపోవటం వల్ల రిజర్వేషన్ ఉన్నా ప్యాసింజర్‌లో ప్రయాణించవలసి వస్తుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాలలో సమగ్ర న్యాయం జరగాలంటే కులగణన అవసరమన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కులగణన ఇదే మొదటి సారి అని.. 1988లో కేవలం జనగణన మాత్రమే జరిగిందన్నారు. కుల ఉద్యమాలకు కులగణనలో ఫలితం లభిస్తుందన్నారు. అందుకే సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించామన్నారు.
Also Read: Kakani Govardhan Reddy: పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదు..
కులగణనతోనే సాధ్యం: ఎంపీ భరత్
ఇంతవరకు ఎప్పుడు కుల గణన జరగక పోవడం ప్రశ్నార్థకమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. సమసమాజ స్థాపన కుల గణనతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు దేశవ్యాప్తంగా కులగణన జరగాలని పార్లమెంట్‌లో కొట్లాడుతామన్నారు. ఇకపై జనగణనతో పాటు కులగణనలు జరపాలని డిమాండ్ చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలు జరగడానికి కుల గణన దోహదపడుతుందన్నారు. పలు సామాజిక వర్గాలకు రాజకీయ ఫలాలు అందడం లేదన్నారు. లెక్కలు ఉంటే ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.