Commando Suicide: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌లోని జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రా(కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఇన్‌స్పెక్టర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని బీజాపూర్ పట్టణంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పిఎఫ్) 170వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సీఆర్‌పీఎఫ్, దాని యూనిట్ కోబ్రా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం దంతేవాడతో సహా దక్షిణ బస్తర్‌లో విస్తృతంగా మోహరించారు.
Read Also: West Bengal: భార్య, కూతురును హత్య చేసి ఆపై భర్త ఆత్మహత్య
కోబ్రా 210వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సఫీ అక్తర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న అతని సహచరులు అక్కడికి చేరుకున్నారు. అక్తర్ తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్తర్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కోబ్రాలోని మోకూర్ క్యాంపులో నియమించబడిన కమాండో బీజాపూర్‌కు చేరుకున్నారని, సెలవుపై ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. “ఆత్మహత్యకు ప్రాథమికంగా కొన్ని కుటుంబ సమస్యలే కారణమని తెలుస్తోంది. అయితే, సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ కనుగొనబడలేదు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది” అని అధికారి తెలిపారు.