చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుల బోట్ కనిపించకుండా పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఆరురోజులుగా నలుగురు మత్స్యాకారుల ఆచూకి లభించలేదు. సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. దీంతో తమవారి పరిస్థితి ఏంటో అర్థం గాక మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు బోట్లతో పాటు ఒక హెలికాప్టర్,డోనార్క్ లైట్ తో గాలింపు కొనసాగించారు. మచిలీపట్నం నుండి మరో రొండు బొట్లు గాలింపు కోసం ప్రయాణం అయ్యాయి. డ్రోన్ కెమేరాలను సైతం సిద్ధం చేశారు అధికారులు.
ఇదిలా వుంటే.. మచిలీపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి జాడలేని నలుగురు మత్సకారుల బోటు అంతర్వేదికి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయినట్లు సమాచారం అందింది. అంతర్వేది వద్ద గాలించినా బోటు కనిపించలేదు. అంతర్వేది వద్ద కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్ అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. మచిలీపట్నం నుంచి అంతర్వేది వరకూ ఉన్న తీరంలోజాడలేని మత్సకారుల కోసం గాలింపు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. మత్స్యకారుల జాడ కనిపించకపోవడంతో తోటి మత్స్యకారుల్లో ఆందోళన పెరుగుతోంది. వారి ఆరోగ్యం ఎలా వుంది, ఆహారం సరిపడా వుందా లేదా అనేది తేలాల్చి వుంది. అధికారులు మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.