CM YS Jagan: మరో 10 రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నిక కోసం కాదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపులా ఉండాలని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పథకాలన్ని రద్దయిపోతాయని సీఎం అన్నారు. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు, మరొకసారి ఓటు వేయాలని.. వైసీపీకి ఓటు వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు ఈ 59 నెలల కాలంలో తీసుకువచ్చామన్నారు. రెండు లక్షల 70వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశానన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
Read Also: CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
మేనిఫెస్టో అంటే ఒక చెత్త ముక్క కాదు, పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం ఇది అని ఆయన పేర్కొన్నారు. లంచాలు లేని, వివక్ష లేని, ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చిన ప్రభుత్వం అని.. చరిత్రలో ఎప్పుడూ చూడని సామాజిక న్యాయం, ఎప్పుడూ చూడని మహిళా సాధికారత వైసీపీ ప్రభుత్వంలో నెరవేర్చామన్నారు. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు..గోరుముద్ద, కాపు నేస్తం, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు, వాహన మిత్ర , ఆరోగ్య సురక్ష పథకాలు చరిత్రలో ఎప్పుడు చూడనివన్నారు. మీ గ్రామంలోనే సచివాలయాలు, మీ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు, మీ గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్,ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో సాధించిన విజయాలు అని ప్రజలకు సీఎం వివరించారు.
2014లో ఒకసారి ఇదే కూటమి జతకట్టి, మాయమాటలు చెప్పి, మోసం చేశారని విమర్శించారు. 2014 మేనిఫెస్టోలో పెట్టిన ఒక్కపనైనా చంద్రబాబు పూర్తి చేశారా అని సీఎం ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేశానని చెప్పిన, చంద్రబాబు వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయలేకపోయాడని.. పొదుపు సంఘాల, రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? అని ముఖ్యమంత్రి ప్రశ్నలు గుప్పించారు. ఇలా ఎన్ని మోసపు మాటలు చెప్పాలో అన్ని చెప్పాడని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేస్తున్న వారిని, మళ్లీ మళ్లీ నమ్మకూడదన్నారు. మళ్ళీ మేనిఫెస్టో అంటున్నాడు, సూపర్ సిక్స్ పథకాలు అంటున్నాడు.. అవేమీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. మళ్లీ పథకాలు కొనసాగాలన్నా, వ్యవసాయ రంగం, వైద్య ఆరోగ్య రంగం, మెరుగు పడాలన్నా చేయాల్సింది ఒకటే వైసీపీకి ఓటు వేయడమన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు,25 పార్లమెంటు స్థానాలు వైసీపీనే గెలవాలన్నారు. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలని… చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి … తాగి వాడేసిన గ్లాస్ సింక్‌లో ఉండాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.