భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ విశిష్టమైన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వేద మంత్రాలతో స్వాగతించారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు సీఎం రేవంత్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తామని తెలిపారు. అంతేకాదు జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.
అంతేకాకుండా.. “తుమ్మల నరేంద్ర చౌదరి, వారి సతీమణి రమాదేవీ, రచనా టెలివిజన్ యాజమాన్యము, భక్తి టీవీ, ఎన్టీవీకి సంబంధించిన సిబ్బంది గత 14 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. మొదట హైదరాబాద్ నగరంలో ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఈ రోజు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవ్ నామస్మరణను వినిపిస్తున్నారు. 14 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి వారు తమ జీవితకాలంలో ఒక్కసారైన కోటిదీపోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలన్న భక్తిని ఎన్టీవీ చైర్మన్ దంపతులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఓ మధుర జ్నాపకంగా భావిస్తాను అని సీఎం రేవంత్ తెలిపారు.
భక్తి టీవీ దేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్ గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ ను కూడా వెనక్కి నెట్టి భక్తి టీవీ భక్తుల మన్ననలు పొందడం గొప్ప విషయమని అందుకు ఎన్టీవీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. భక్తి టీవీ కోటిదీపోత్సవం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి, హోదాను ఇవ్వడానికి మీ అందరికి తెలియజేయడానికి తాను సంతోషిస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. అంతేకాదు కోటి దీపోత్సవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని, జాతీయ పండుగగా గుర్తించాలని పీఎం మోడీకి లేఖ రాస్తానని సీఎం రేవంత్ తెలిపారు. ఎంత కష్టంలో ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొంటే గొప్ప శక్తిని అందిస్తుందని కొనియాడారు. ఈ శక్తితో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.