CM Revanth Reddy: ఎల్బీస్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం.. ఎల్బీస్టేడియం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంకు చేరుకోనున్నారు. సీఎం రాక కోసం సెక్రటేరియట్ ను అందంగా ముస్తాబు చేశారు. అంతేకాకుండా.. కొత్త సీఎం రాక కోసం సెక్రటేరియట్ లో ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయ అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు.