Revanth Reddy Played Football: గత రెండు నెలలుగా విరామం లేకుండా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ( శనివారం)తో ప్రచారాలు ముగిశాయి. దీంతో ఇవాళ ఉదయం 10.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లనున్నారు. ఎన్ఎస్యూఐ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పుట్ బాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే నేటి (ఆదివారం) ఉదయం 9. 30గంటలకే సీఎం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటికి చేరుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
కాగా, ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడాకారుడి వలె గోల్ వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పరుగులు తీశారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్ బాల్ ఆడారు ఆయన. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులు ఫుట్ బాల్ గేమ్ ఆడారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌కి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టీ.శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమం ముగిసన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయినా కొడంగల్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి కొడంగల్ లోని ఇంట్లో ఆయన బస చేయనున్నారు. అలాగే, రేపు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.