International Nurses Day 2024: నర్సులు నిజంగా సేవామూర్తులే. రోగి ఆస్పత్రికి వచ్చిన దగ్గర నుంచి కోలుకుని ఇంటికి వెళ్లేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. కరోనా సమయంలో వైద్యులతో పాటు నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివి. మందులు, చికిత్సతో పాటు రోగి ఒక వ్యాధి నుండి కోలుకోవడానికి సరైన సంరక్షణ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందులో 24 గంటలూ రోగి సంరక్షణలో నిమగ్నమైన వైద్యుల కంటే నర్సులదే పెద్ద బాధ్యత. వారిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ జరుపుకుంటారు. ఈ నర్సుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది?.. ఈ సంవత్సరం థీమ్ ఏమిటో తెలుసుకుందాం.
Read Also: Char Dham Yatra : యమునోత్రికి భక్తుల వరద.. దయచేసి రావొద్దంటున్న పోలీసులు
నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తుచేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది.
1859లో ‘నోట్స్ ఆన్ నర్సింగ్’ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్ సేవలను గుర్తించిన ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్’ సంస్థ 1965 నుండి నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ICN) 1974లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ గౌరవార్థం, మే 12న అధికారికంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈ సంవత్సరం థీమ్ ఏమిటి?
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2024 థీమ్ “మన నర్సులు, మన భవిష్యత్తు,రక్షణ యొక్క ఆర్థిక శక్తి.” అంటే (మన నర్సులు. మన భవిష్యత్తు. రక్షణ యొక్క ఆర్థిక శక్తి) అని ప్రకటించబడింది.