Bhadrachalam Tour: కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది.. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇవాళ (సోమవారం) కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది.
Read Also: Jagadish Reddy : కాంగ్రెస్ మార్పు మాత్రం తిరోగమనంలా ఉంది
ఇక, ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయనుంది. దశల వారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం అందిస్తామని తెలిపింది. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారి కోసం వివిధ రకాల డిజైన్లను ప్రభుత్వమే తయారు చేసి పెట్టింది. ఈ డిజైన్లను సీఎం రేవంత్ నేడు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు గానూ 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో 7, 740 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
Read Also: Kakarla Suresh: టీడీపీ-జనసేన-బీజేపీల కలయిక చారిత్రాత్మకం..
అయితే, సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి తొలుత యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత భద్రాచలం వెళ్లనున్నారు. ఇక, భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సీఎం దర్శించుకుంటారు. మధ్యాహ్నం భద్రాచలం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత సీతారామా ప్రాజెక్టుతో పాటు సాగునీటి రంగానికి సంబంధించిన ఇతర అంశాలు, భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మణుగూరు చేరుకుని అక్కడ సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఆ తర్వాత హెలిక్యాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.