CM Tour: ఈనెల 22న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లను ప్రారంభించి.. అనంతరం 11 గంటలకు పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కన నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.
Read Also: PM Modi: ఈజిప్టుకు ప్రధాని మోదీ.. ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు పర్యటన
మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O. Ms. 82 జారీ చేసిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.184 కోట్ల 87లక్షల 55 వేల నిధులు మంజూరు కాగా, మొత్తం వ్యయంలో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 75 శాతం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.
Read Also: Madhya Pradesh: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు
గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మూడు అంతస్తుల్లో 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కనే గల రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేటాయించారని ఈ సందర్భంగా తెలియజేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని, శర వేగంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు ఆయన తెలిపారు.