తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నేడు మేడ్చల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పే వాళ్ళు వస్తారని, తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు గుర్తు పెట్టుకోవాలన్నారు. అందరూ బీఆర్‌ఎస్‌కి అండగా ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ హయాంలో అంతా కరెంటు కోతలేనని, కాళేశ్వరం, పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్‌లతో నీటి సమస్య పోయిందన్నారు. మేడ్చల్‌తో పాటు పలు నియోజకవర్గాలు మిని భారత్ లాంటివని, హైదరాబాద్ పరిసరాల్లో ఉండే నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి బీమా సదుపాయం అని మేనిఫెస్టోలో పెట్టుకున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తరవాత మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి స్కీం అమలు చేస్తామన్నారు. మేడ్చల్ నియోజకవర్గంను మోసే శక్తి మల్లారెడ్డికి మాత్రమే ఉందని, మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక్క మేడ్చల్‌లోనే తాగునీటి కోసం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు చేసిందని, 26వేలు, 2బీహెచ్‌కే ఇళ్లను పంపిణీ చేసిందని, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను ఉచితంగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందని ముఖ్యమంత్రి తెలిపారు. “మేము ప్రారంభించిన అభివృద్ధి కొనసాగాలి. ఎందుకంటే ఐదు దశాబ్దాలుగా మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతరులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులలా చూసుకున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. 1956లో మా నాయకులు చేసిన చిన్న పొరపాటు దశాబ్దాలుగా మనల్ని వెంటాడుతోంది’’ అని కేసీఆర్ ఎత్తిచూపారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే తప్పుడు వాగ్దానాలపై మేడ్చల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.