ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్దం బస్సుయాత్ర ప్రారంభించే ముందు కేస్రపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన నేతలతో జగన్ మాట్లాడుతూ.. బస్సుయాత్ర అద్భుతంగా విజయవంతం కావడంతో అసూయతో ఉన్న ప్రతిపక్షాలు ఉన్మాద దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని ఆయన వ్యాఖ్యానించారు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నానన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని, ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవని సీఎం జగన్, పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. అయితే వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైఎస్సార్‌సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చిన నేతలందరినీ అందరినీ చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్.. ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు.