కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్‌ను పోలిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్‌ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పుకొచ్చారు.
అసోంలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత ఫిబ్రవరి 4న రాహుల్‌ను పోలిన వ్యక్తి ఎవరనే వివరాలను బయటపెడతామని పేర్కొన్నారు. అసోంలో దాదాపు యాత్ర ముగిసేంత వరకూ ప్రజలకు అభివాదం చేసేందుకు తనను పోలిన వ్యక్తిని రాహుల్ తన వాహనం నుంచే ఉపయోగించుకున్నట్టు వెల్లడించారు. దీనిపై మీడియాలో ఒక వార్త రావడంతో పశ్చిమబెంగాల్ యాత్ర ప్రారంభానికి ముందే ఆ వ్యక్తిని గౌహతిలో వదిలేశారని తెలిపారు.
గౌహతిలో బారికేడ్లు విరగొట్టిన కేసులో రాహుల్ కూడా నిందితుడని.. దీనిపై సిట్ విచారణ జరుపుతోందని చెప్పారు. రెండో కేసు జోర్హాట్‌లో నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులో అసోం కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా నిందితుడిగా ఉండగా, దీనిపై జిల్లా పోలీసులు విచారణ జరుపుతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.