CM Chandrababu: జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. దావోస్‌కు తొలిసారి వచ్చిన రోజులను గుర్తు చేసిన ఆయన.. అప్పట్లో భారతీయులే అరుదుగా ఉండేవారని, ముఖ్యంగా తెలుగు వాళ్లు కనిపించేవారు కాదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సమావేశానికి వచ్చిన వారిని చూస్తే విజయవాడలోనో, తిరుపతిలోనో ఉన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం 20 దేశాల నుంచి తెలుగు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారని, మొత్తం 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారని తెలిపారు. అందులో 148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్నా తెలుగు సంప్రదాయాలను కాపాడుకుంటూ సంక్రాంతి వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని, కోడిపందాలు తప్ప అన్ని సంప్రదాయాలు పాటిస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
Nari Nari Naduma Murari: సంక్రాంతి మళ్లీ మొదలయ్యింది.. అసలైన ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’!
విజన్–2020, ఐటీ గురించి తాను మాట్లాడిన రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని.. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు తెలుగు యువత ప్రపంచం నలుమూలలకు వెళ్లి అవకాశాలు అందిపుచ్చుకుంటోందని సీఎం అన్నారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశ గర్వకారణమని, 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి నరేంద్ర మోడీ రూపంలో అత్యంత బలమైన నాయకత్వం ఉందని పేర్కొన్నారు.
యువతకు అవకాశాలు కల్పించడమే తమ విధానమని.. అందుకే లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి యువ నాయకులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మంత్రిగా ఉండటం గర్వకారణమన్నారు. పదవులు వస్తే గ్లామర్ మాత్రమే కాకుండా విమర్శలు, ఇబ్బందులు కూడా వస్తాయని, వాటిని ఎదుర్కొనే ధైర్యం యువత అలవరుచుకోవాలని సూచించారు.
ఇటీవలి ఎన్నికల్లో ఎన్నార్టీలు కీలక పాత్ర పోషించారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ సహకరించారని, బీజేపీ కూడా కూటమిలో భాగమైందని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించమని కోరితే ఎన్నార్టీలు ఆలోచించకుండా ముందుకొచ్చారని, కొందరు రాష్ట్ర నేతలతో సమానంగా కేసులు కూడా ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, మీ సహకారంతో 93% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించామన్నారు.
విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిర్మించడం సాధ్యమా అనే సందేహాలు ఉన్నప్పటికీ.. 18 నెలల్లోనే రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పని చేస్తున్నామని తెలిపారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం గర్వకారణమని, గూగుల్ వంటి అతిపెద్ద పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఆర్సెల్లార్ మిట్టల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తోందని, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని, ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని వివరించారు.
Wife Kills Husband: ప్రేమ ముసుగులో రక్తపాతం.. భర్త ప్రాణాలు తీసిన భార్య.. ముగ్గురు అరెస్ట్.!
విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి, కొనుగోళ్లు చేస్తున్నామని, దీనివల్ల డేటా సెంటర్లు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. వివిధ సంస్థలతో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని, ఇవి సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలమన్నారు. లైచెన్ స్టెయిన్ వంటి చిన్న దేశం టెక్నాలజీ వల్ల సంపన్నంగా మారిందని ఉదాహరణగా పేర్కొన్న సీఎం క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలపై రాష్ట్రం దృష్టి సారించిందన్నారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయం, వైద్యం, ప్రజాసేవలు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని.. డ్రోన్ ఆపరేషన్ల అనుమతుల బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని కోరారు.
ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైసెస్, ఫార్మా రంగాల అభివృద్ధి, సంజీవని ప్రాజెక్టుతో ప్రజారోగ్య పరిరక్షణ, ప్రకృతి సేద్యం, నీటి భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏపీ రిజర్వాయర్లలో 958 టీఎంసీల నీరు ఉందన్నారు. చివరగా ఏఐకు చిరునామాగా భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్లే నిలవాలని పిలుపునిచ్చారు.