అమరావతిలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శాఖల పనితీరుపై ఆయన సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. జిల్లా కార్యవర్గాల కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం, ఈ వర్క్‌షాప్ ద్వారా నాయకులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జిల్లా కమిటీల నియామకాన్ని పూర్తిచేసిన టీడీపీ హైకమాండ్.. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తును కొనసాగిస్తోంది. అలాగే 25 పార్లమెంటరీ పార్టీ కమిటీల నేతలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ వర్క్‌షాప్‌లో కీలక నిర్ణయాలు, సూచనలు వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వర్క్‌షాప్‌కు టీడీపీ చీఫ్‌గా సీఎం చంద్రబాబు నాయుడితో పాటు నారా లోకేష్ కూడా హాజరుకానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై నేతలకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. నేడు జరిగే ఈ వరుస కార్యక్రమాలు రాష్ట్ర పాలనతో పాటు పార్టీ రాజకీయ దిశకు కూడా కీలకంగా మారనున్నాయి.