Solar Energy Cloth : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. అత్యవసరమైనప్పుడు మీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ అయిపోయిందనుకోండి పరిస్థితి ఏంటి.. మీ దగ్గర చార్జర్ లేదు. చార్జర్ ఉంది కరెంట్ లేదు. లేదా చార్జింగ్ పెట్టుకునేందుకు సాకెట్ లేదు. ఆ సమయంలో నరకం అనుభవించాల్సిందే. వీటికి ఇంగ్లండ్లోని నాటింగ్ హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. ఎక్కడికి వెళ్లినా మీ ఒంటిపై చిన్న విద్యుత్ తయారీ కేంద్రం ఉండేలా ఓ నూతన ఆవిష్కరణ చేశారు.
Read Also: Munugode : ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ భారీ క్యాంపెయిన్.. ఏకంగా 38మంది
సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అవసరాలకు అనుగుణంగా నిత్యం కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్త్రాన్ని తయారు చేశారు. ఆ వస్త్రంతో షర్ట్, ప్యాంటు కుట్టించుకొంటే సరి. ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను జేబులో పెట్టేసి చార్జింగ్ చేసుకోవచ్చు. నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చి, వస్త్రాన్ని అల్లారు. ఆ వస్త్రాన్ని ఎండలో ఉంచి సౌర శక్తిని గ్రహించేలా చేశారు.
Read Also: IT raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల సోదాలు.. ఒకేసారి 20చోట్ల దాడులు
దాంతో అవి 400 మిల్లీవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్తు సెల్‌ఫోన్ చార్జింగ్‌కు సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకొచ్చని వివరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను తయారు చేస్తామని వెల్లడించారు. 51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు ఉన్న వస్త్రాన్ని పరిశోధకులు తయారు చేశారు. నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్ సెల్‌ను పాలిమర్ రెజిన్ కోటింగ్ చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చారు. ఒక్కో సోలార్ సెల్‌ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు. రెండు నూలు పోగుల మధ్య సోలార్ సెల్ తీగను అమర్చుకొంటూ వస్త్రాన్ని తయారు చేశారు. ఇక షర్ట్ వేసుకుని ఎంచక్కా ఫోన్ చార్జింగ్ ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసేయండి.