Munugode : తెలంగాణాలో ప్రస్తుతం ఏ నోట విన్నా మునుగోడు ముచ్చట్లే.. ప్రధానంగా బరిలో ఉన్న మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన శక్తినంతా కూడగట్టుకుంటున్నాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలన్నీ స్టార్ క్యాంపెయిన్ తో ఎన్నికల ప్రచారం చేపడుతున్నాయి. ఇప్పటికే ఒకరిపై ఒకరు పలు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడా తగ్గకుండా ఓటర్లను ప్రలోభం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. ప్రతీ ఓటరును ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ మరింత సత్తువను కూడదీసుకుని బరిలోకి దిగింది. ఈ మేరకు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 38మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ క్యాంపెయిర్ల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు.
Read Also: Minister Roja: ప్రజాగర్జనను పక్కదోవ పట్టించేందుకు పవన్ పర్యటన
ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క, రోహిత్ చౌదరి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, వి. హన్మంతరావు, జానా రెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, కొండా సురేఖ, సీతక్క, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, శంకర్ నాయక్ తదితరులున్నారు. జాబితాలో ఇంకా చాలా మంది నేతలున్నా… వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జగ్గారెడ్డి పేరు కనిపించకపోవడం గమనార్హం. అదే జిల్లాకు చెందిన మల్లు రవి పేరు కూడా జాబితాలో కనిపించలేదు.
Read Also: YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
ఇదిలా ఉంటే మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గురువారం ఒక్కరోజే 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు సమర్పించారు. చివరి రోజైన నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. నవంబర్ 3న పోలింగ్ జరుగనుండగా, అదేనెల 6న ఫలితాలు వెలువడనున్నాయి.