Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది సీఐడీ.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పలు కీలక అంశాలను పేర్కొంది.. ఈ కేసులో రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ అభియోగాలు మోపింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. వారితో పాటు ఈ కేసులో తుళ్ళూరు అప్పటి తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ సంస్థ ఎండీ అంజనీ కుమార్ కూడా నిందితులుగా ఉన్నారు.. అమరావతిలో 1100 ఏకరాలకు సంబంధించి రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు అంచనా వేసింది సీఐడీ.. చంద్రబాబు, నారాయణ బినామీలతో రాజధాని ఏరియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోకుండా.. కొనుగోలు చేసినట్టు సీఐడీ గుర్తించింది.. 2014కు ముందు.. ఆ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ పరిశీలిస్తే 942 ఏకరల్లో 1330 మంది వ్యక్తులు CRDAలో LPS ద్వారా లబ్ది పొందినట్టు చార్జీ షీట్ లో పేర్కొంది సీఐడీ.. కొమ్మరెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే రియల్టర్ ను అప్రూవర్ గా స్టేట్ మెంట్ నమోదు చేసినట్టు కోర్టుకు తెలిపింది సీఐడీ..
Read Also: Kate Middleton: బ్రిటన్ యువరాణి ఫొటో విడుదల.. అయినా అనుమానాలే?
కాగా, మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో 2020లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 420 (మోసం), 409 (నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘన), 506 (నేరపూరిత బెదిరింపు), 166 & 167 (ప్రజా సేవకుడు చట్టాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేయబడింది. 217 (ప్రజా సేవకుడు తప్పుగా నమోదు చేయడం), 109 (ప్రేరేపణ)తోపాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన వివిధ సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం, మరియు అవినీతి నిరోధక చట్టం కింది కేసులు మోపారు.. సీఐడీ లెక్కల ప్రకారం 1,100 ఎకరాల భూమి విలువ రూ.4,400 కోట్లు. రాజధాని నగరంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీల నుంచి అసైన్డ్ భూములను లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఇతర మంత్రులు, వారి ‘బినామీలు’ కబ్జా చేశారని సీఐడీ పేర్కొంది.. ల్యాండ్ పూలింగ్ పథకం కింద అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందన్న ధీమాతో వారికి ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని అభియోగాలు మోపింది.. అనంతరం అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జీవో జారీ చేయాలని మంత్రులు అప్పటి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.