బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ గత జనవరి నుంచి అదృశ్యమయ్యారు. కడుపులో ఆమెకు శస్త్ర చికిత్స జరిగిందని వాదనలు వినపడ్డాయి. అప్పటి నుంచి ఆమె అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలైన వాదనలు పుట్టుకొచ్చాయి. సీరియస్‌గా ఉందని కొందరు.. ఇంకేదో అయిందని మరికొందరు పుకార్లు సృష్టించారు. అయినా కూడా ఇప్పటి వరకు రాజకుటుంబం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా రాజకుటుంబం నుంచి కేట్ మిడిల్టన్‌కు సంబంధించిన ఫొటోను విడుదల చేసింది. అయినా దీనిపైన కూడా నెట్టిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫొటో ఎడిట్ చేసి విడుదల చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది.
కేట్ ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా అనేక వదంతులు వినిపించాయి. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి ఎక్కడా కన్పించకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది.
ఆదివారం బ్రిటన్‌లో మదర్స్ డే పురస్కరించుకుని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఓ ఫొటో విడుదల చేసింది. అందులో కేట్ తన ముగ్గురు పిల్లలతో కలిసి కన్పించారు. గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆ ఫొటోను తన భర్త, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం తీసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అయితే ఆ ఫొటోపై కొద్ది గంటల్లోనే నెట్టింట చర్చ మొదలైంది. రాజకుటుంబం విడుదల చేసిన ఫొటో ఎడిట్ అయి ఉంటుందని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. ఫొటోలో కేట్ కుమార్తె ఎడమ చేయి సరైన అలైన్‌మెంట్‌లో లేకపోవడంతో అది నిజమైంది కాకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక కేట్ చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవడం కూడా ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. అయితే దీనిపై స్పందించేందుకు కెన్సింగ్టన్ ప్యాలెస్ నిరాకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇకపోతే కేట్‌కు శస్త్రచికిత్స జరిగితే మూడ్రోజుల్లోనే తిరిగి కోలుకోవచ్చు. కానీ ఇన్ని రోజుల్లో బాహ్య ప్రపంచానికి కనిపించకుండా ఎందుకుంటారు? అంటే ఏదో జరిగిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆమె ఇంకా ఏదో పెద్ద రోగంతో బాధపడుతున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. అసలేం జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నెటిజన్లు కోరుతున్నారు.