Chitty Scam: 300 మంది కష్టార్జితం.. సుమారు 4 కోట్ల రూపాయలు.. చిట్టీల రూపంలో గల్లంతైపోయాయి. భారీ మోసాన్ని తట్టుకోలేక బాధితులు కుదేలయ్యారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యే శరణ్యంగా భావించి ఆందోళన చేపట్టారు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
వారంతా పేద మధ్య తరగతి కుటుంబాలుకు చెందినవారు. చిన్న చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో నెల నెలా కట్టుకొని అవసరాలకు వాడుకునే వారు. పిల్లల చదువులకు, ఇళ్ళ నిర్మాణాలకు, పెళ్ళిళ్ళు చేయటానికి ఉపయోగ పడతాయని నమ్మకంగా ఒకరి దగ్గర ఏళ్ల తరబడి చీటీలు కడుతున్నారు. చివరకి వారి నమ్మకాన్ని వమ్ము చేసి ఏకంగా రూ. 4 కోట్లతో పరారయ్యారు. దీంతో లబోదిబో మంటున్నారు బాధితులు.
Read Also:Nalgonda: బావా మరదళ్లకు వివాహేతర బంధం అంటగట్టారు.. బాధ భరించలేక ఇద్దరూ సూసైడ్..
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు చౌడువాడలో చిట్టీ పేరుతో వందలాది మందిని ఓ మహిళ మోసం చేసింది. బాధితులంతా న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. చౌడువాడ శివారు గరుగుబిల్లికి చెందిన పెదిరెడ్ల పద్మజ అలియాస్ చల్లపల్లి పద్మకు సామర్లకోటకు చెందిన శ్రీనుతో వివాహమైంది. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. 15 ఏళ్ల కిందట చౌడువాడకు వచ్చి స్థిరపడ్డారు. భర్త చనిపోవడంతో కొన్నాళ్లపాటు అనకాపల్లిలో ఉన్నారు. అక్కడ ఉంటూనే చౌడువాడ గ్రామస్థులతో పరిచయాలు పెంచుకుని పప్పుల చీటీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారు కాసుల చీటీలను ప్రారంభించారు. అనంతరం రూ. లక్ష నుంచి రూ.20 లక్షల వరకు చిట్టీలు వేశారు.
నమ్మకం కలిగిన వారంతా.. చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకే ఇచ్చేవారు. ఇలా రూ. 4 కోట్లు వసూలు చేసి వారం రోజుల కిందట ఆరోగ్యం బాగోలేదని కుమారుడితో ఇంటి నుంచి వెళ్లిన పద్మజ తిరిగి రాలేదు. వారు వెళ్లిన రెండో రోజుల వరకు ఫోను పని చేసింది. ఆ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో గ్రామ పెద్దలకు తెలిపి బాధితులు అంతా కలిసి కె.కోటపాడు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నమ్మకంగా ఉంటూనే ఇలా బోర్డు తిప్పేయడంతో బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ప్రాధేయ పడుతున్నారు.
కాళ్లు అరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నిందితులను పట్టుకోకుండా తమ గోడు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆందోళన చెందారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మోసం చేసిన నిర్వాహకరాలను పట్టుకుని తమకు అప్పగించాలని.. పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. చౌడవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇందులో కొంతమంది ఒంటిపై కిరోసన్ పోసుకొని చనిపోతామంటూ బెదిరించారు. ఇప్పటివరకు సుమారు 300 కుటుంబాలకు పైగా మోసానికి గురైనట్టు తెలిపారు. తిరిగి డబ్బులు చేతికి అందకపోతే ఆర్థికంగా చితికి పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలిపారు పోలీసులు. కానీ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాధితులు.