China: ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్‌లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు. చైనా మిత్ర దేశమైన రష్యా యుద్ధం కారణంగా సాయుధ సంపత్తిని భారీగా కోల్పోవడం తెలిసిందే. దాంతో రష్యాకు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేయవచ్చని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఉద్దేశమేమీ తమకు లేదని చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు.
Read Also: Russian Missile Strike: ఉక్రెయిన్‌లోని స్లోవియన్స్క్‌పై రష్యా క్షిపణి దాడి.. 8 మంది మృతి
రష్యాకు ఆయుధాల విక్రయాల గురించి చైనా అత్యున్నత స్థాయి అధికారి క్విన్ గ్యాంగ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ద్వంద్వ పౌర, సైనిక వినియోగంతో వస్తువుల ఎగుమతిని కూడా చైనా నియంత్రిస్తుందని ఆయన తెలిపారు. “సైనిక వస్తువుల ఎగుమతి విషయంలో చైనా వివేకం, బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబిస్తుంది” అని క్విన్ బీజింగ్‌లోని డయోయుటై స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్‌తో సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేయడానికి చైనా సుముఖతను మంత్రి పునరుద్ఘాటించారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి నుంచీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చైనా దన్ను రష్యాకు ఎంతగానో ఆసరా అయింది. రష్యాకు ఆయుధాలు కూడా సమకూర్చేందుకు చైనా సన్నద్ధమవుతున్నట్టు తమకు నిఘా సమాచారముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫిబ్రవరిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చైనా రష్యాకు ఆయుధాలను సరఫరా చేయదని క్విన్ చేసిన వాగ్దానాన్ని వైట్‌హౌస్ శుక్రవారం స్వాగతించింది. అయితే కొంత భయాన్ని వ్యక్తం చేసింది.