Pneumonia outbreak in China: చైనాలో పుట్టిన ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని 2-3 ఏళ్లు గడగడలాడించింది. ఇప్పటికీ కొత్త కరోనా వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా అదే చైనాలో మరో కొత్తరకం ‘న్యుమోనియా’ వెలుగు చూసింది. చైనాలో ఇప్పటివరకు 77 వేల మంది చిన్నారులు న్యుమోనియాతో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా వేగంగా విస్తరిస్తోందట. చైనాలో వ్యాపిస్తోన్న నిమోనియాపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది.
చైనా ఉత్తరాన ఉన్న ప్రావిన్స్ ప్రాంతం లియానింగ్. ఇక్కడే కొత్తరకం న్యుమోనియా వ్యాధి వెలుగులోకి వచ్చింది. పాఠశాలలకు వెళ్తోన్న చిన్నారులు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాస సంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్‌లో న్యుమోనియా విస్తరిస్తోంది. చైనాలో శీతాకాలం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మరోసారి చైనా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేతుందేమో అని ప్రజల మనస్సులలో భయం నెలకొంది.
ప్రస్తుతం న్యుమోనియా వైరస్ సోకిన చిన్నారులు ఆస్పత్రులకు పోటెత్తడంతో.. చైనాలోని హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో ఆస్పత్రుల్లో పడకల కొరత ఉండడంతో.. మరిన్ని పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ మరో కొవిడ్ వైరస్‌ను తలపిస్తోందని చైనా వాసులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చైనా అధికారులు కోరారు.
Also Read: Rajasthan Election: రాజస్థాన్ లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
మరోవైపు గురువారం చైనా ప్రభుత్వం నుంచి వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఈ సమాచారం ఆధారంగా.. న్యుమోనియా వ్యాధి గురించి ఇప్పటివరకు అసాధారణ లక్షణాలు ఏమీ కనుగొనలేదని చెప్పారు. కొత్త వైరస్ కూడా లేదని తెలిపింది. న్యుమోనియాపై ఆందోళన చెందాల్సిన లక్షణాలు వెలుగులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం భరోసా ఇస్తుంది.