కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లిలో బుధవారం నాడు నిర్వహించిన రోడ్ షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంతో సంక్షేమం గ్యారెంటీ అని చెప్పగా.. బీజేపీ వస్తే సంక్షోభం గ్యారెంటీ అని ఆయన తెలిపారు. అయితే, సీఎం రేవంత్‌కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక్కసారి జైలుకు పంపినందుకే రేవంత్.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని.. మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళ్తే.. ఇంకెంత స్థాయికి వెళతారో చూడాలన్నారు. తమకు గతంలో అండగా ఉన్నానని, ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు మరిన్ని సేవలందిస్తానని రంజిత్ రెడ్డి తెలిపారు.
Read Also: Bandi Sanjay: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
ఇక, గతంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకే రాలేదని విమర్శించారు. శానిటైజర్ పూసుకుని ఇంట్లో పడుకున్నారని చెప్పారు. ఆయన ఏ ఒక్కరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వరని చెప్పుకొచ్చారు. తాను మీకు తలలో నాలుకలా ఉంటానని… కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. అందుకే ఈ చేవెళ్ళ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఇక, తమ చేవెళ్ళ కోసం ఇన్ని గంటల సమయం ఇస్తున్న రేవంత్ అన్నకు థ్యాంక్స్ చెప్పారు. తమ కోసం ఇన్ని గంటల పాటు ఓపిగ్గా ఎదురు చూసిన అక్కలకు, అన్నలకు అందరికీ రంజిత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఇదే ఓపికతో ఈనెల 13వ తేదీన కచ్చితంగా హస్తం గుర్తుకే ఓటేసి, తనను గెలిపించాలన్నారు.