రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు. తూనికలు కొలతలు విభాగంలోని పెండింగ్స్, పౌరసరఫరాల అంశంలో ఇప్పటికి ఉన్న పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించాను. రెండు రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో తనిఖీ చేశా. కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించింది. ప్యాకెట్ల తూకంలో 5౦ నుంచి 80గ్రాములు తక్కువగా కనిపించింది. రాష్ట్రంలో 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని అప్పుడే ఆదేశించా. ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. 24 చోట్ల అక్రమాలు తేలాయి. బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నాం. సరకులు సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించా.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Vishwak Sen: శవాల మీద పేలాలు.. చెంబుతో బయలుదేరుతున్నారు.. రివ్యూయర్స్ పై విశ్వక్ ఫైర్
అక్రమాలు చేసిన వారు, దీని వెనుక ఉన్న వారెవరినీ వదిలిపెట్టమని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అక్రమార్కులు అందరిపైనా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే సరుకుల్లో దోపిడీ చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా మార్పును కోరారు.. ఆ మేరకు మార్పు తప్పక ఉంటుందన్నారు. మేము నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తామని.. ఎవరైనా ప్రజల ఇబ్బంది పెట్టినా.. మోసం చేసినా సహించేదిలేదన్నారు. ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదు పారదర్శకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.