Char Dham Yatra 2025: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు చేపట్టే యాత్రే చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రను ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావించడంతో పాటు, మోక్షాన్ని ప్రసాదించేదిగా కూడా నమ్ముతారు భక్తులు. ప్రతేడాది లక్షలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటుంటారు. 2024లో ఈ యాత్రలో 30 లక్షలకు పైగా భక్తులు పాల్గొనగా.. 2025లో ఈ యాత్ర ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే..
ఏప్రిల్ 30న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఆ తర్వాత మే 2న కేదారనాథ్ ఆలయం ప్రారంభం కానుంది. ఇలా చివరగా మే 4న బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం అందించనుంది. అలాగే ఈ ఆలయాల మూసే తేదీలను కూడా ప్రకటించారు. అక్టోబర్ 22న యమునోత్రి ఆలయం, అక్టోబర్ 23న గంగోత్రి, కేదారనాథ్ ఆలయాలు మూతపడనున్నాయి. ఇక చివరగా నవంబర్ 6న బద్రీనాథ్ ఆలయం మూసివేయనున్నారు అధికారులు.
Also Read: Stock Market: అమెరికా ప్రకటనతో భారీ లాభాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
ఇక చార్ ధామ్ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేయాలి. ఇందులో భాగంగా ఇమెయిల్, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, ఓటర్ ఐడి అప్‌లోడ్ చేయాలి. కచ్చితంగా తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఈ-పాస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ పక్రియను చూసినట్లయితే.. డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోన్‌ప్రయాగ్ కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చు. అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు, మెడికల్ సర్టిఫికేట్, ఇంకా ఫోటో సమర్పించాలి. అక్కడి అధికారుల తాజా సమాచారం ప్రకారం, ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి విధించలేదని తెలిపారు. ట్రాఫిక్, తాగునీరు, పార్కింగ్ వంటి సదుపాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.