ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ప్రచారం చేయడానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. శనివారం సాయంత్రం 6గంటలకే ప్రచారం ముగియనుంది. ఎన్డీయే కూటమి తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
Read Also: Kangana Ranaut: సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదు.. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
కాగా, ఇవాళ ( మంగళవారం) మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలో టీడీపీ అధినేత పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామో తెలియజేయనున్నారు. ఇక, పుంగనూరులో నేతల పర్యటన నేపధ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గత చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలను పోలీసులు తీసుకుంటున్నారు.