రష్యాలో (Russia) ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టింది.
రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరుగుతోందని కేంద్రం తెలిపింది. అక్కడ ఉద్యోగాల పేరు చెప్పి ప్రైవేట్ సైన్యంలో చేర్పిస్తున్నారని.. దీంతో భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నారని తెలిపింది. అటువంటివారిని గుర్తించి వెనక్కి పంపే ఏర్పాట్లు భారత ప్రభుత్వం చేస్తోందని చెప్పుకొచ్చింది.
మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో చేర్చుతున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా జరిపిన సోదాలు, దాడుల్లో అక్రమ రవాణా నెట్‌వర్క్ బయటపడింది. పలువురు ఏజెంట్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఇక ఏజెంట్ల మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని భారత విదేశీ వ్యవహారాల శాఖ కోరింది. ఇది అత్యంత ప్రమాదం, ప్రాణాపాయంగా పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇటీవల భారత్ నుంచి రష్యా వెళ్లిన పలువురి యువకులను ఏజెంట్లు మోసం చేసి సైన్యంలో చేర్పిస్తున్నారు. దీంతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ యువకుడి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై చర్చలు చేపట్టింది.