Sambhaji Maharaj: మరాఠా పాలకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి వివాదాస్పద కంటెంట్ తీసివేయని కారణంగా నలుగురు ‘‘వికీపీడియా’’ ఎడిటర్లపై కేసు నమోదైంది. శంభాజీపై వివాదాస్పద కంటెంట్‌ని తొలగించడంలో విఫలమైనందుకు మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు 4-5 మంది వికీపీడియా ఎడిటర్లపై కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. వికీపీడియాలో తప్పుడు సమాచారాన్ని సవరించడం, వ్యాప్తి చేయడంలో వీరు పాల్గొన్నారని, ఇది శాంతిభద్రతల పరిస్థితికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: Rekha Gupta: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా
ఈ కంటెంట్ తొలగించాలన్న అభ్యర్థనకు ప్రతిస్పందన కోరుతూ సైబర్ సెల్ గతంలో అమెరికాకు చెందిన వికీపీడియా ఫౌండేషన్‌కి నోటీసులు పంపింది. అయితే, దీనిపై సంస్థ ఇప్పటికీ స్పందించలేదు. సైబర్ సెల్ వికీపీడియాకు 15 ఈమెయిల్స్ పంపింది, అయినప్పటికీ వికీపీడియా నుంచి స్పందన రాలేదు. అభ్యంతరకరమైన కంటెంట్ శంభాజీ మహారాజ్ వేలాది మంది అనుచరులలో అశాంతికి దారితీయవచ్చని సైబర్ సెల్ తన నోటీసులో పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 మరియు 79లను వికీపీడియా ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘‘ఛావా’’ విడుదలై, బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో వికీపీడియా కంటెంట్‌పై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విక్కీ కౌశల్ శంభాజీ పాత్రని పోషించగా, ఆయన భార్య యేసుభాయి రోల్ రష్మికా మంధాన కనిపించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైబర్ సెల్‌ను వీలైనంత త్వరగా వికీపీడియాను సంప్రదించాలని ఆదేశించారు, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిన ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇటువంటి కంటెంట్‌ను సహించబోమని అన్నారు. “భావ ప్రకటనా స్వేచ్ఛ అపరిమితమైనది కాదు. అది ఇతరుల స్వేచ్ఛను ఆక్రమించకూడదు” అని ఫడ్నవీస్ నొక్కిచెప్పారు.