KTR Road Show: ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్నా పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్‌కు తమ్ముడి లాంటి వారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్‌లలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. 2014లో బడే భాయ్ మోడీ చాలా కథలు చెప్పారని.. రూ. 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అని పెద్ద పెద్ద బిల్డప్‌లు ఇచ్చారని విమర్శించారు. కిషన్ రెడ్డి ఎంపీ, కేంద్రమంత్రి అయ్యి ఐదేళ్లు అయ్యిందని.. పైసా పని చేయలేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదని, మెట్రోకు పైసా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
కానీ గుజరాత్ లో వరదలు వస్తే మాత్రం మోడీ ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. గుజరాత్ వాళ్లే ప్రజలా ? హైదరాబాద్ వాళ్లు ప్రజలు కాదా? అంటూ ప్రశ్నించారు. అడ్డగుట్టకు, సీతాఫల్ మండి డివిజన్‌కు, సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పి ఓటు అడిగే దమ్ముందా అంటూ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. సిగ్గు లేకుండా ఐఐటీలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారని.. ఒక్క స్కూల్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ పప్పు, ఉప్పు, చింతపండు ధరలన్నీ పెంచేశారని అన్నారు. మోడీ వచ్చిన నాడు ముడి చమురు బ్యారెల్‌కు వంద డాలర్లు ఉందని.. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్‌కు 84 డాలర్లు ఉందన్నారు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటారని.. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నారో చెప్పాలన్నారు. వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇది అబద్దమని కిషన్ రెడ్డి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఎక్కువ సీట్లు ఇచ్చారని.. మీకు రుణపడి ఉంటామన్నారు.
రేవంత్ రెడ్డి కూడా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. బస్సు ఫ్రీ, మహిళలకు రూ. 2500, వృద్ధులకు 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అన్నారని.. రేవంత్ రెడ్డి చెప్పి వాటిలో ఒక్కటైనా వచ్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పామని.. రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. కేసీఆర్ సీఎం కాలేదని బాధపడుతున్నారని.. 10 నుంచి 12 సీట్లు బీఆర్‌ఎస్‌కు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారన్నారు. ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. మళ్లీ బీజేపీలో చేరడని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడొచచి ఓటు వేయమని అడుగుతున్నారని.. ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు. ఒక్కటే ఓటుతో అటు బడేభాయ్‌కు, చోటేభాయ్‌కు బుద్ధి చెప్పాలని.. కేసీఆర్‌కు తమ్ముడి లాంటి నేత పద్మారావు గౌడ్‌ను గెలిపించాలన్నారు.
కేసీఆర్ తనను పిలిచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పంపించారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తెలిపారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు కార్పొరేటర్ ఎన్నికల సమయంలో వచ్చినా బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో సికింద్రాబాద్ నుంచి అడుగుపెట్టబోతున్నామని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నాడు గల్లీలో గెలిచామని, నేడు ఢిల్లీలో గెలుస్తామన్నారు. ప్రతి గడప గడపలోని అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు తనకు బాగా తెలుసన్నారు. సికింద్రాబాద్‌లో లక్ష మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 11 శాతం ముందంజలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ , లింగాని లక్ష్మీ ప్రసన్న , కంది శైలజ , రాసురి సునీత , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్ , త్రినేత్ర గౌడ్, కిషోర్ గౌడ్ , కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.