BRS on Delhi Ordinance Bill: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ తరఫున చర్చలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ అధికారులు ఎవరికి రిపోర్ట్ చేయాలి.. వారి బాధ్యతలు అధికారాలు ఏంటి.. దీనికి ఎవరు జవాబుదారి అంటూ ఎంపీ ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడడం లేదన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఏం చేయడం లేదంటున్నారు.. ఆ అంశం గురించి మేం మాట్లాడం.. ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారో చూడాలన్నారు.
Also Read: Rythu Runa Mafi: తెలంగాణలో రుణమాఫీ షురూ.. తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ది
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏమయిందని ఆయన ప్రశ్నలు గుప్పించారు. నాటు నాటు పాటలాగా ఢిల్లీ సీఎం, హోంమంత్రిని ప్రధాని మోడీ ఆడిస్తున్నారన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. ఢిల్లీ అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్‌కి రిపోర్ట్ చేయాలా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలా.. ఇది తేలాల్సి ఉందన్నారు. అమిత్ షా చక్కగా ప్రసంగం చదివి వినిపించారు.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అధికారాలన్నీ ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయన్నారు. కేంద్రం అధికారాలను చేజిక్కించుకోవాలని చూస్తోంది.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బీజేపీ ప్రభుత్వం 80 ఆర్డినెన్స్‌లు తెచ్చిందని.. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మాత్రం రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ అధికారులు ప్రజలచేత ఎన్నుకోబడని వారికి రిపోర్ట్ చేయాలా.. పాలకులకు రిపోర్ట్ చేయాలా అని ఆయన ప్రశ్నించారు.
Also Read: Haryana Violence: హర్యానా అల్లర్ల నుంచి తప్పించుకున్న జడ్జి.. నూహ్ జిల్లాలో కొనసాగుతున్న కర్ఫ్యూ
సీఎం ఛైర్మన్‌గా అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు.. అందులో ఇద్దరు అధికారులు కేంద్రం నియంత్రణలోనే ఉంటే సీఎం చేసేదేముంటుందన్నారు. అథారిటీలన్నీ కేంద్రం చేతిలోనే ఉంటే.. అధికారులంతా లెఫ్టినెంట్ గవర్నర్‌కి రిపోర్ట్ చేస్తారు గానీ సంబంధిత మంత్రులకు చేయరు.. ఇది హాస్యాస్పదమన్నారు. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును తీవ్రంగా వ్యతరేకిస్తున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.