Harish Rao: బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడారు. అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. రైతు భరోసా, బీమాలకు నిధులు ఇవ్వలేదన్నారు. రైతుల విషయంలో హస్తం మొండి చేయి అయిందని.. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం నిధుల కేటాయింపులు లేవన్నారు. రైతుల బోనస్‌కు బోగస్ చేసింది ఈ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు కరెంట్ రావట్లేదని.. సబ్ స్టేషన్‌లకు వెళ్లి లాగ్ బుక్‌లు చూద్దాం రండి అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
Read Also: CM Revanth: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..
బడ్జెట్‌లో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయని.. వీటిలో రెండు హామీలు మాత్రమే అమలు అయ్యాయని.. మిగతా 11 హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. వీటిలో ఏది కూడా అమలు చేయట్లేదన్నారు. జనవరి నెల పెన్షన్‌లను ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని.. లేకుంటే నిరుద్యోగుల నుంచి నిరసనలు తప్పవన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలి.. దానికి కేటాయింపులు లేవన్నారు. ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. గృహ జ్యోతి ద్వారా ఉచిత కరెంట్ కావాలంటే 8 వేల కోట్లు కావాలి , కానీ రెండు వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఆటో కార్మికులకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా…ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు.