యుద్ధం.. దేశభక్తి నేపథ్యంతో వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అంత సులభం కాదు. కానీ 1997లో వచ్చిన ‘బోర్డర్’ ఆ అంచనాలను తలకిందులు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సరిగ్గా 29 ఏళ్ల తర్వాత వచ్చిన దాని సీక్వెల్ ‘బోర్డర్ 2’ కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 322 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ. 350 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ విజయవంతమైన ప్రయాణంలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Also Read : Mega #158 : బాబీ – చిరు మూవీలో మెగాస్టార్‌కు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ!
గుజరాత్‌లోని వల్సాద్‌లోని రాజ్‌హంస్ మల్టీప్లెక్స్‌లో శుక్రవారం ఉదయం షో ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు సినిమా హాల్ సీలింగ్ (కప్పు) ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తూ ప్రేక్షకులు ఇంకా హాల్‌లోకి ఎంట్రీ అవ్వకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే అలర్ట్ అయిన థియేటర్ సిబ్బంది షోను క్యాన్సిల్ చేసి అందరినీ సురక్షితంగా బయటకు పంపారు.
ఈ ఘటన 1997లో ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఢిల్లీలోని ఉపహార్ సినిమాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాన్ని (59 మంది మృతి) గుర్తుచేసింది. అప్పుడు ప్రాణనష్టం జరిగితే, ఇప్పుడు అందరూ క్షేమంగా బయటపడటం ఊరటనిచ్చే విషయం. ఈ రెండు ఘటనలు థియేటర్ల నిర్వహణ.. భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఏదేమైనా, ఆన్-స్క్రీన్ యుద్ధం చూపిస్తున్న ఈ సినిమా, రియల్ లైఫ్‌లోనూ ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం.