Blinkit: గత కొద్దీ రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నారు. మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీ సేవలు అందించిన ఈ సంస్థలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా, జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, బ్లింకిట్ ఇప్పుడు ఏసీలను కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.
Read Also: USA: ఇండియన్స్‌కి షాక్.. “గ్రీన్ కార్డ్” ప్రాసెసింగ్‌ను నిలిపేసిన యూఎస్
ఈ నూతన సేవ కోసం బ్లింకిట్ ప్రముఖ ఏసీ తయారీ కంపెనీ లాయిడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా, లాయిడ్ బ్రాండ్‌కు చెందిన వివిధ రకాల ఏసీలను బ్లింకిట్ వినియోగదారులకు తక్కువ సమయంలోనే అందించనుంది. ఈ కొత్త సేవను ప్రస్తుతానికి ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మాత్రమే ప్రారంభించామని, త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ దిండ్సా తెలిపారు. ఇలా 10 నిమిషాలలో ఏసీ డెలివరీ అయిన తర్వాత 24 గంటల్లోగా ఇన్‌స్టలేషన్ సిబ్బంది వినియోగదారుల ఇంటికి వెళ్లి ఏసీని ఫిక్స్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నూతన సేవతో, వేగవంతమైన డెలివరీలో బ్లింకిట్ మరొక ముందడుగు వేసినట్లైంది.