Nitin Nabin: భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. మంగళవారం సీనియర్ నాయకుడు నితిన్ నబిన్‌ను బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జగత్ ప్రకాశ్ నడ్డాకు బదులుగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. పార్టీ లోపల గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సాగిన దీర్ఘ ప్రక్రియ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 45 ఏళ్ల నితిన్ నబిన్‌కు ఈ బాధ్యతలు ఇవ్వడం వెనుక స్పష్టమైన సంకేతం ఉంది. రాబోయే రోజుల్లో కీలకమైన పలు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండేళ్లలో బెంగాల్, తమిళనాడు, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2029 లోక్‌సభ ఎన్నికలు సైతం దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలంగా నిలబెట్టడం, కొత్త తరం నాయకత్వాన్ని ముందుకు తేవడం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ 84 ఏళ్ల మల్లికార్జున ఖర్గేనే నాయకత్వం వహించడం, బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో పోల్చితే యువతకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది.
READ MORE: Venkatesh : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెంకీ బిజీ.. దృశ్యం 3 ఇక దాదాపు లేనట్టే.
కొత్త సారథి ఎన్నికవ్వడంతో దేశంలో ఒక్కసారిగా నితిన్ నబిన్ ఎవరు? అనే ప్రశ్నమొదలైంది. బీజేపీ సీనియర్ నాయకుల ప్రకారం.. నితిన్ చాలా కష్టపడే వ్యక్తి. పార్టీకి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అందుబాటులో ఉండే స్వభావం, అందరినీ కలుపుకొని వెళ్లే ఆలోచన ఉందని బలంగా చెబుతున్నారు. ‘సమన్వయం’ అంటే కోఆర్డినేషన్ ఆయనకు బాగా వచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నబిన్ కాయస్థ వర్గానికి చెందినవారు కావడం రాజకీయంగా ఆయనకు అనుకూలంగా మారింది. ఈ వర్గం ఏ ఇతర వర్గాల జోలికి వెళ్లదని, ఘర్షణలు ఉండవనే భావన ఉంది. ముఖ్యంగా పార్టీ పెద్దలు నితిన్ నబిన్‌పై నమ్మకం పెట్టుకోవడానికి మరో కారణం కూడా ఉంది. “పార్టీ అగ్రనాయకత్వం ఎలా పనిచేస్తుందో ఆయనకు తెలుసు. ఎవరినీ దాటిపోరు. సీనియర్ నాయకులందరినీ గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తారు” అన్న విశ్వాసం ఉంది. అంటే ఇప్పటివరకు నడ్డా, అమిత్ షా నడిపిన బండిని అదే దారిలో సాఫీగా ముందుకు తీసుకెళ్లగలరన్న మాట. వయసు చిన్నదే అయినా నితిన్ నబిన్‌కు అనుభవం మాత్రం ఎక్కువే అని చెబుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీతోనే ఉన్నారు. బిహార్‌లో యువజన విభాగం నుంచి ఎదిగి, కీలక ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో పాత్ర చాలా కీలకం. నితిన్ నబిన్ ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో పట్నా వెస్ట్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బ్యాంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచారు. బిహార్‌లో న్యాయం, రోడ్లు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. పార్టీ పరంగా చూస్తే, బీజేపీ యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బిహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
READ MORE: MM Keeravani: ఢిల్లీ కవాతులో కీరవాణి మ్యాజిక్.. 2500 మంది కళాకారులతో మెగా షో..
నితిన్ నబిన్ పేరు దేశవ్యాప్తంగా బలంగా వినిపించడానికి ప్రధాన కారణం 2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు. అప్పట్లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అక్కడ బలంగా ఉంది. చాలా సర్వేలు కూడా కాంగ్రెస్‌కే అనుకూలంగా అంచనా వేశాయి. కానీ నితిన్ నబిన్ నాయకత్వంలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలిచింది. పార్టీ నిర్మాణాన్ని తిరిగి సరిచేయడం, ప్రతి ప్రాంతాన్ని చిన్నచిన్న స్థాయిలో చూసుకోవడం వంటి వ్యూహాలు ఈ విజయానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటారు. ఆ విజయం నితిన్ నబిన్‌కు జాతీయ అధ్యక్ష పదవికి దారి తీసింది. కష్టమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొని ఫలితం చూపించగలడన్న నమ్మకాన్ని ఆయన సంపాదించారు. అంతేకాదు, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంలోనూ కీలక పాత్ర పోషించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో నితిన్ నబిన్‌ను పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇకపై బీజేపీని ఏ దిశగా తీసుకెళ్తారో, రాబోయే ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.