భారతీయ చలనచిత్ర సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి.. త్వరలో ఒక అపురూపమైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అదెంటీ అంటే దేశభక్తికి నిలువుటద్దంలా నిలిచే ‘వందేమాతరం’ గేయానికి ఆయన తనదైన శైలిలో సరికొత్తగా స్వరకల్పన చేశారు. ఈ అద్భుతమైన గీతాన్ని ఈ ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రదర్శించనున్నారు. విశేషమేమిటంటే, దేశం నలుమూలల నుండి విచ్చేసిన దాదాపు 2500 మంది కళాకారులతో కలిసి కీరవాణి ఈ గీతాన్ని ఆలపించనున్నారట. వందేమాతరం గేయం రాసి గతేడాదితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక బాధ్యతను కీరవాణికి అప్పగించింది. దీంతో స్వాతంత్రోద్యమ కాలం నుండి భారతీయులందరిలో స్ఫూర్తిని నింపుతున్న ఈ గేయం, కీరవాణి సంగీతంలో మరింత ప్రతిష్టాత్మకంగా వినిపించనుంది.
Also Read : Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
కాగా ఈ ప్రతిష్టాత్మక అవకాశంపై కీరవాణి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.. ‘గణతంత్ర దినోత్సవ కవాతు వంటి మహా వేడుకకు సంగీతాన్ని అందించడం, వేలమంది కళాకారులతో కలిసి దేశభక్తి గీతాన్ని పలికించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, మన దేశ గొప్పతనాన్ని, ఐక్యతను చాటిచెప్పే ఒక చారిత్రక ఘట్టం’ అని పేర్కోన్నారు. మొత్తనికి ఆస్కార్ వేదికపై తెలుగు కీర్తిని చాటిన కీరవాణి, ఇప్పుడు భారత గణతంత్ర వేడుకల్లో తన సంగీతంతో దేశ ప్రజలందరినీ ఉర్రూతలూగించబోతున్నారు. 2500 మంది గొంతుకల నుంచి ఒకేసారి వందేమాతరం వినిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుందని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వినూత్న ప్రదర్శన గణతంత్ర దినోత్సవ కవాతులోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.