BJP MP Dr K Laxman Spoke on Sabarimala Ayyappa Devotees on Rajya Sabha: శబరిమల అయ్యప్ప భక్తుల కష్టాలపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడారు. ప్రతి ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనానికి కేరళ వెళుతుంటారని.. అక్కడి ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండా ఉదాసీనత చూపిస్తోందన్నారు. 20 గంటలుగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందిపడుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా.. కేరళ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.
జీరో అవర్లో అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలపై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ తెలుగులో మాట్లాడారు. ‘ప్రతియేటా అయ్యప్ప భక్తులు మాలవేసి, దీక్ష చేపట్టి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు కేరళకు వెళ్తున్నారు. కేరళ ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండా ఉదాసీనత చూపుతోంది. దాంతో భక్తులు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. 20 గంటలుగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందిపడుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా.. కేరళ ప్రభుత్వానికి పట్టడం లేదు. అయ్యప్ప భక్తుల పట్ల కేరళ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. నిష్ఠతో దీక్ష చేసే భక్తులపై లాఠీఛార్జి చేయిస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు’ అని అన్నారు.
Also Read: Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవలకు అంతరాయం.. టైమ్‌లైన్‌లు ఖాళీ!
‘తమిళనాడుకు చెందిన 12 ఏళ్ల అమ్మాయి పద్మశ్రీ, 15 ఏళ్ల రాజేశ్ పిళ్లై చనిపోయారు. నీటి కొరత, అధ్వాన్నమైన పారిశుధ్యం, ఆహార కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రవాణా వసతులు కూడా కేరళ ప్రభుత్వం కల్పించడం లేదు. 2011 జనవరి 14న మకరజ్యోతి దర్శనం సమయంలో తొక్కిసలాట జరిగి 106 మంది చనిపోయారు. కేరళ హైకోర్టు చెప్పినా, పార్లమెంటులో ప్రస్తావించినా హిందూ వ్యతిరేక నిరంకుశ కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేరళ ప్రభుత్వం భక్తుల పట్ల వివక్ష, హిందూ దేవాలయాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూసిన వాళ్లే అంతమయ్యారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను మోహరించి భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నా’ అని ఎంపీ కోరారు.