హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు లేవు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆమోదిస్తున్నట్లు అర్థమవుతుంది.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం బాధాకరమన్నారు. సీఎస్ కు అన్ని ఆధారాలతో లేఖ ఇస్తున్నాం.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 37ను ఉపసంహరించుకుని.. ఆ భూమిలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి అని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డికి రైతాంగం మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. డిసెంబర్ 9 పోయింది ఇప్పడు ఆగష్టు 15లోపు రుణమాఫీ అని కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు 80వేల కోట్లు అవసరం అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు.. రాహుల్ గాంధీతో చెప్పి పాకిస్థాన్ బడ్జెట్ కూడా తెచ్చుకోండి.. ఎన్నికల్లో బాలకృష్ణ మాదిరిగా రేవంత్ రెడ్డి డైలాగ్స్ కొడుతున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
Read Also: Chhattisgarh Encounter: కంకేర్‌లో పోలీసులు-నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోలు హతం..!
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆగష్టు 15వ తేదీలోపు రైతు, బీసీ డిక్లరేషన్లు అమలు చేస్తావా.. లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. మేనిఫెస్టోపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన ఉందా అనే అనుమానం కలుగుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు.. బీజేపీని గెలిపించేందుకు 5 చోట్ల బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను పెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను పెడితే.. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలహీనమైన వాళ్లేనా?.. డిక్లరేషన్లు అమలు చేసే వరకు బీజేపీ వెంటాడుతుంది.. రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.