రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ ( సోమవారం ) తొలిసారి భేటీ అయింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇక, ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా ఎంపికయ్యారు. మేనిఫెస్టో కమిటీలో సిక్కు, ముస్లిం, క్రిస్టియన్‌తో సహా మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇందులోని సభ్యులు ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
Read Also: Leopard Attack: ఇంట్లోకి దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి..!
ఇక, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులపై బీజేపీ దృష్టి సారిస్తుంది. మేనిఫెస్టోలో రైతులు లేదా వ్యవసాయంపై ప్రత్యేక అధ్యాయం ఉండవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. పార్టీ ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సలహాలను కోరే ప్రక్రియను కొనసాగిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత నెలలో ‘వికిత్ భారత్, మోడీ యొక్క హామీ’ వీడియో వ్యాన్‌ను ఫ్లాగ్ చేశారు. ఇక, ప్రజల దగ్గర నుంచి సలహాలను సేకరించేలా బీజేపీ ప్లాన్ చేసింది. ప్రజల నుంచి వచ్చిన సలహాలను తమ మేనిఫెస్టోలో రూపొందించే అవకాశం కూడా ఉంది.
Read Also: Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..!
అయితే, ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ మధ్య లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి అని ఎన్నికల సంఘం తెలిపింది. 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. రానున్న ఎన్నికల్లో 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో 96.8 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఈసీ పేర్కొనింది.