Godavari Anjireddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు తెలంగాణ బీజేపీ నేతల కసరత్తు తుది దశకు చేరుకుంది.. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన రాష్ట్ర నేతలు.. లిస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.. తొలి విడతలో 50 నుంచి 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. అయితే, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ అధిష్టానం గోదావరి అంజిరెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు.
గత కొన్ని సంవత్సరాలుగా పటాన్ చెరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా గోదావరి అంజి రెడ్డి ఉత్సాహంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులతో కలిసి పాల్గొనడం అందరికీ తెలిసిందే. సభలు, పార్టీ ముఖ్య కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆ చోటుకు ఒకరోజు ముందే చేరుకొని క్యాడర్ మొత్తాన్ని చూసుకుంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, డీ కే అరుణ, బండి సంజయ్ తో సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా కేంద్ర పెద్దలు ఎవరు రాష్ట్రానికి వచ్చిన కూడా ఇంటికి ఆహ్వానించి ఘనంగా ఆతిథ్యం ఇస్తూ వస్తున్నారు. అంతే కాదు పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర పెద్దలలో సలహాలు, సూచనలు తీసుకునే వారు.
మరోవైపు.. పార్టీకి సంబంధం లేకుండా సొంత నిధులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గోదావరి అంజిరెడ్డి.. ఇటీవల ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక స్కూల్ కి 50 లక్షలు విరాళం అందించి, అత్యాధునిక టెక్నాలజీ తో అభివృద్ధి చేశారు. ఒక ఆటో డ్రైవర్ మరణించగా అతని కుటుంబానికి 20 లక్షల రూపాయల చెక్ అందచేశారు. గ్రామ గ్రామాన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్ షెల్టర్స్ నిర్మించి, బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ ట్యాంకులు చేయించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే విధంగా తమకు చేతనైనంత పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ పట్ల చూపిస్తున్న విధేయతకు, నియోజక వర్గ ప్రజల కోసం చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈసారి బీజేపీ అధిష్టానం గోదావరి అంజిరెడ్డికి పటాన్‌చెరు నియోజక వర్గ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ సాగుతోంది.