ఏపీలో రాజధానిపై రగడ రగులుతూనే ఉంది. ఇప్పటికే హైకోర్టు రాష్ట్రానికి ఒక రాజధానే అంటూ ఆదేశాలు జారీ చేయడంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం విభజన చట్టం అమలు చేయడం జరిగిందని, రాజధాని ఎక్కడ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది 2014లోనే నిర్ణయం తీసుకున్నారని, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చాలంటే కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
తల కిందకి కాళ్లు పైకి పెట్టి జపం చేసినా అమరావతి రాజధానిగా ఉండాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానులు మూడు పెడతాం… 30 పెడతామంటే కుదరదని, వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు సరిగ్గా వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఏపీలో ఇసుక, మైనింగ్, లిక్కర్, ల్యాండ్ మాఫియాలు నడుస్తున్నాయన్న సుజనా చౌదరి.. ఏపీలో లిక్కర్ స్కామ్ లు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. నాలుగు లక్షల మంది పార్టీ కార్యకర్తలని వాలంటీర్లుగా పెట్టారని ఆయన విమర్శించారు.